Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఆధ్యాత్మిక పునాదిపై సమాజం మనుగడ - చామర్తి ఉమామహేశ్వరరావు, (ఐఎఎస్ రిటైర్డ్



ఈ దేశం అంటే ప్రేమ, ఈ సంస్కృతి, ధర్మాల మీద ప్రేమ, ఈ ప్రజలంటే ముఖ్యంగా బడుగువర్గాల వారంటే ప్రేమ. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం వివేకానందుల సందేశాలలో ఉంది. వాటిని అర్థంచేసుకొని అమలుచేయడమే మన తక్షణ కర్తవ్యం. సనాతన ధర్మ ప్రాతిపదిక ఆధారంగా వివరించబడిన ఆధ్యాత్మిక చైతన్యం పునాదులపై దేశాన్ని పునరుజ్జీవింప చేయటమే మనం 150 జయంతి ఉత్సవాల సందర్భంగా చేయగల కనీస కర్తవ్యం.

హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పూర్తిగా జీర్ణింపచేసుకొని, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క దివ్యాశీస్సులు సంపూర్ణంగా పొందిన వ్యక్తి స్వామి వివేకానంద. అంతర్గతంగా హిందూమత సారాంశాన్ని తనది చేసికొని, బహిర్గతంగా, అనన్య సామాన్యమైన తేజస్సుతో దేశానికి చైతన్యాన్నందించిన యుగ పురుషుడు ఆయన. భారతదేశ స్వాతంత్య్ర సమరం సమయంలో ప్రముఖ నాయకులందరికి అందిన చుక్కాని, ఆయన ఆదర్శం. అహింసా మార్గంలో కోట్లాది మంది యువకులు అనేక వృత్తులవారు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనగలిగారంటే వారికి వెంట, వెనక ఉన్న ప్రత్యక్ష, పరోక్ష ఆధ్యాత్మిక శక్తులు కారణం అని పెద్దలు చెపుతున్నారు. రామకృష్ణ పరమహంస తయారుచేసిన ఆధ్యాత్మిక కార్యదక్షుడు స్వామి వివేకానందుడు. స్వాతంత్య్ర సమరయోధులకు వెంట ఉన్న ఆధ్యాత్మిక శక్తి స్వామి వివేకానంద.

పాశ్చాత్య దేశాలలో హిందూ మత సారాన్ని, ఆచరణలో వేలాది సంవత్సరాలుగా ఈ మతం, సంస్కృతి ఇతరులను ఎలా తనలో ఇముడ్చుకున్నదో, ఆదరించిందో, ప్రబోధించి, భారతదేశాన్ని ఒక ఉన్నత ఆధ్యాత్మిక పీఠాన్ని పాశ్చాత్యుల మనసులో ఏర్పాటుచేసిన ఒక ఝంఝా మారుతం వివేకానందస్వామి. అందుకే పాశ్చాత్య పత్రికలు వారిని ఒక ""Cyclonic Mark'' గా అభివర్ణించారు. దేశానికి తిరిగివచ్చి కొలంబోనుండి అల్మారావరకు వారు చేసిన ఉపన్యాసాలు- నిస్వార్థం, త్యాగం, సేవ- ఇవి మూలమంత్రాలుగా దేశ ప్రజలపై ఒక బలమైన ప్రభావం చూపాయి. ఇవి స్వాతంత్య్రానికి పునాదులయ్యాయి.
ఆ తరువాత చైనాతో భారతదేశం యుద్ధంలో ఓడిపోయి, నిస్సత్తువగా ఉన్న సమయంలో వివేకానందుల శత జయంతి ఉద్యమాలు విద్యుచ్ఛక్తిగా దేశాన్ని మొత్తాన్ని నిద్రలేపాయి. ఈ లోకంలో లేకపోయినా ఈ దేశానికి అంతటి స్ఫూర్తిని ఇవ్వగలిగిన మరొక వ్యక్తి లేడంటే ఆశ్చర్యం లేదేమో!
గత 50 సంవత్సరాలలో దేశంలో, ప్రపంచంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఒక అత్యంత సంక్లిష్ట సమయం. ప్రపంచానికి, భారతదేశానికి ఇంటా, బయటా పెను సవాళ్ళను ఎదుర్కొంటున్న భారత్, స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవాలను ముచ్చటగా మూడోసారి, జాతికి నూతన ఉత్తేజాన్ని, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందించటానికి ఒక మహదావకాశం.
ప్రపంచం ఒక క్లిష్ట సమయంలో ఉందని మనం ముందర గమనించాం. శాంతికి దూరమై, అవినీతి, హింసల మధ్య చిక్కుకొని విలవిల్లాడుతోంది ప్రపంచం. సనాతనంగా మనం నమ్మిన విలువలకు బీటలు వారుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. పాశ్చాత్య నాగరికతకు మూలస్తంభాలైన ధనవ్యామోహం, భోగ లాలసతలు మానవ జాతిని శాసిస్తున్నాయి. ఈ దేశంయొక్క ధర్మం, సనాతన విలువలు నేర్పడానికి కాని, చర్చించడానికి కాని సమయం, శ్రద్ధలేని ఒక సమాజం ఏర్పడుతోంది. భారతదేశం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల (Liberali- sation, Privitisation, Globalisa-tion- LPG అందాం) ప్రభావంవల్ల, సాంకేతిక విప్లవాలవల్ల అనేక ఒత్తిళ్ళకు లోనవుతోంది. వీటి ప్రభావం మన విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో అంతర్గతంగా కొందరు, కుహనా మేధావులు మరికొందరు ప్రజలమధ్య విభేదాలు సృష్టించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
విద్యాలయాలు సమాచార సంగ్రహాలుగా తయారయ్యాయి. విద్య ద్వారా రావలసిన వ్యక్తిత్వ వికాసము, కొన్ని మూల విలువల ఆచరణ మచ్చుకైనా కానరాదు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ఒక అకృత్యం దేశానికి పెద్ద కుదుపునకు లోను చేసింది. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా త్వరగా విచారించి కఠిన శిక్ష వేయవలసిందే. వేసిన శిక్ష అమలుచేయవలసిందే. అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించిన శిక్షను అమలుచేయలేకపోవడం ఈ దేశ బలహీనత, ప్రభుత్వాల అసమర్థత. అయితే ఢిల్లీవంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? యువకుల్లో ఇంతటి కీచక అరాచకత్వం ఎందుకు ఎదుగుతున్నది? ఈ సంఘటనలు ఎందుకు మరల మరల జరుగుతున్నాయి? దీనికి కారణం: మొదటిది యువతకు విలువలు నేర్పాలి అన్న విషయాన్ని ప్రభుత్వాలు మరచిపోవడం, రెండవది చేసిన తప్పుకు న్యాయపరంగా శిక్షపడకపోవడం. పాఠశాలల్లో, కళాశాలల్లో విలువల ఆధారంగా జీవితాన్ని నిర్మాణం చేసుకోవడం నేర్పనంత కాలం ‘‘యువభారతం’’ లోపభూయిష్టంగానే ఎదుగుతుంది.
ఈ దేశ చరిత్రలో ఆధ్యాత్మిక పునాదుల ఆధారంగా సమాజాన్ని నడిపిన వారంతా మహాత్ములయ్యారు, యుగకర్తలయ్యారు, మార్గదర్శకులయ్యా రు. గౌతమబుద్ధుడు, శంకరాచార్య, విద్యారణ్య, శివాజీ, వివేకానందుడు మొదలైనవారు ఇందుకు ఉదాహరణలు. అదే ఆధ్యాత్మిక ఒరవడిలో కరంచంద్ గాంధీ మహాత్మాగాంధీ అయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ ‘పండిట్’గానే ఉండిపోయారు.
ఒక విధమైన అంతర్గత ఆధ్యాత్మిక అనుశాసనం వారి బాహ్యప్రవృత్తికి మూలమై నిలిచింది. అటువంటి మహాత్ముల కోవలో స్వామి వివేకానంద ఒక యుగపురుషుడుగా నిలిచాడు. శ్రీరామకృష్ణ పరమహంస ఆయన ఆధ్యాత్మిక శక్తి. అట్టి వివేకానందుల సందేశాలు ఒక్కొక్కటి ఒక చిన్న పుస్తకానికి సరిపోయేంత సమగ్రమైనవి.
వివేకానందుల వారి సందేశాలను, రచనలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన సందేశాలను క్రోడీకరించవచ్చు. ఈ క్రింద పేర్కొనబడినవే కాకుండా ఇంకా కొన్ని చేర్చవచ్చు.
ఈ క్రింద క్రోడీకరించిన అంశాలు, వివేకానందుల సందేశాల ఆధారంగా సమీకరించబడినవి. ఆధునిక మానవుణ్ణి వేధిస్తున్న సమస్యలకు, సామూహికంగా భరిస్తున్న సమస్యలకు సమాధానాలు వివేకానందుల వారి ఈ ఆలోచనలలో లభించగలవనే నమ్మకంతో ఈ ప్రయత్నం.
1. మానవజాతి మొత్తం అభివృద్ధి చెందాలి. వైవిధ్యంలో ఏకాత్మతను గుర్తించే విధంగా ప్రపంచ సంస్కృతి పరిణామం చెందాలి. సంస్కృతి, సంప్రదాయాలలో ఏకాకృతికాక వైవిధ్యం గౌరవించబడాలి. విజ్ఞాన శాస్త్రానికి, మతానికి, తర్కం- నమ్మకం, కవిత- తాత్వికత మొదలైన ద్వం ద్వాల మధ్య ఏ రకమైన స్పర్థలేదు.
2. ప్రతి ఒక్కరు తమ తమ మార్గంలో ఒక అత్యున్నత ఆదర్శమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించాలి.
3. మానవ సమస్యలకు అంతిమ సమాధానాలు వ్యక్తియొక్క నైతిక మూలాలు ఆధ్యాత్మిక జీవనంమీద ఆధారపడి ఉన్నాయి.
4. నాగరికత ధ్యేయం మతం యొక్క ధ్యేయం వేరు కాదు.
5. తన మీద తన నమ్మకమే వ్యక్తియొక్క ప్రగతి రహస్యం. విశ్వాసమే బలానికి పునాది. వ్యక్తియొక్క అభివృద్ధి తనలో సహజంగా ఉన్న శక్తి యొక్క ఆవిష్కరణ మాత్రమే.
6. ‘విద్య’ వ్యక్తిలో ‘పరిపూర్ణత’యొక్క అభివ్యక్తీకరణమే.
7. మతం వ్యక్తిలో ఉన్న దైవత్వంయొక్క అభివ్యక్తీకరణమే.
8. అన్ని మతాలు ఆ పరబ్రహ్మను ఏదో రూపంలో చేరుకోవడానికి చేసే ప్రయత్నమే.
9. ప్రపంచ శాంతికి, పురోభివృద్ధికి మతాల మధ్య సామరస్యత, పరస్పర గౌరవం అనివార్యం.
10. ఆధ్యాత్మిక చింతన, మతము జీవితంలోని అన్ని రంగాలలో ప్రవేశించి తద్వారా విశ్వజనీనమైన ఆధ్యాత్మిక దృఢత్వాన్ని గుర్తించాలి.
11. మానవుడికి సేవచేస్తూ భగవంతుణ్ని చేరవచ్చు.
‘తత్వబోధనాంశాలతో దేశాన్ని ముంచెత్తండి’ అనే పిలుపును స్వామీజీ సమాజానికిచ్చారు. తత్త్వబోధ అంటే సత్యసంధత, న్యాయబద్ధత, ప్రేమ, శాంతికాముకత, స్నేహశీలత. ఇవి భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసాయి.ఈ దేశం అంటే ప్రేమ, ఈ సంస్కృతి, ధర్మాల మీద ప్రేమ, ఈ ప్రజలంటే ముఖ్యంగా బడుగువర్గాల వారంటే ప్రేమ. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం వివేకానందుల సందేశాలలో ఉంది. వాటిని అర్థంచేసుకొని అమలుచేయడమే మన తక్షణ కర్తవ్యం.సనాతన ధర్మ ప్రాతిపదిక ఆధారంగా వివరించబడిన ఆధ్యాత్మిక చైతన్యం పునాదులపై దేశాన్ని పునరుజ్జీవింప చేయటమే మనం 150 జయంతి ఉత్సవాల సందర్భంగా చేయగల కనీస కర్తవ్యం. గతంలో జరిగిన శత జయంతి ఉత్సవాలు దేశానికి నూతన ఉత్తేజాన్ని కలిగించగా ప్రస్తుత 150 జయంతి ఉత్సవాలు భారత జాతిలో నవ చైతన్యాన్ని, శక్తిని అందిస్తాయని ఆశిద్దాం

source: andhrabhoomi
ఆధ్యాత్మిక పునాదిపై సమాజం మనుగడ - చామర్తి ఉమామహేశ్వరరావు, (ఐఎఎస్ రిటైర్డ్ Reviewed by JAGARANA on 8:34 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.